: కుర్రాళ్ళు దమ్ము చూపారు: రైనా
బంగ్లాదేశ్ తో మూడో వన్డే వర్షార్పణం కాగా, సిరీస్ 2-0తో టీమిండియా వశమైంది. తొలి రెండు వన్డేల్లో అత్యద్భుతమైన ఆటతీరుతో రైనా సేన ఆతిథ్య బంగ్లా జట్టును చిత్తు చేసిన సంగతి తెలిసిందే. మిర్పూర్లో నిన్నటి మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. వరుణుడి ప్రతాపంతో మ్యాచ్ కు పలుమార్లు అంతరాయం కలిగింది. కాగా, మ్యాచ్ అనంతరం భారత సారథి రైనా మాట్లాడుతూ, సిరీస్ లో కుర్రాళ్ళు అమోఘమైన ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. స్టూవర్ట్ బిన్నీ, మోహిత్ శర్మ అవకాశాలను అందిపుచ్చుకుని సత్తా చాటారని తెలిపాడు. వరల్డ్ కప్ సమీపిస్తున్న దశలో కుర్రాళ్ళు రాణించడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేశాడు.
ఆసియా కప్ సందర్బంగా తాము ఇక్కడికి వచ్చినప్పుడు నెట్స్ లో తస్కిన్ అహ్మద్ బౌలింగ్ చేశాడని... ఇప్పుడా యువకుడిని బంగ్లా జట్టులో చూస్తుంటే ఆనందం కలిగిందని రైనా చెప్పుకొచ్చాడు.