: దటీజ్ దీదీ... అన్నంత పనీ చేసింది!
దెబ్బకు దెబ్బ తీయడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీరేవేరు! బీజేపీ ఎంపీలు తమ అనుమతి లేకుండా బెంగాల్ లోని హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించడంతో ఆగ్రహానికి గురైన దీదీ, బీజేపీ పాలిత రాష్ట్రంలో పర్యటించి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అయితే, అదేమీ పెద్ద విషయం కాదని, ఈ విషయాన్ని ఆమె మర్చిపోయి ఉంటారని అంతా భావించారు. కానీ, మమతా దీదీ ఆడిన మాట తప్పరని నిరూపించారు.
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లా భియాలీ ఖేలా గ్రామంలో అత్యాచారానికి గురైన 30 ఏళ్ల గిరిజన మహిళను సందర్శించేందుకు సుఖేందు శేఖర్ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎంపీల బృందాన్ని పంపి కమలనాథులకు కంగారు పుట్టించారు. కాగా, ఆ అత్యాచార ఘటనలో బాధితురాలిపై ఆమె భర్త, బంధువులు సహా పది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఎంపీల బృందం ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు న్యాయం చేయలేని ప్రభుత్వం మధ్యప్రదేశ్ ను పరిపాలిస్తోందని దీదీ మండిపడ్డారు.