: క్రికెట్ మ్యాచ్ ను 30 ఓవర్లకు కుదించేలా చేసిన దొంగ
సాధారణంగా వర్షం పడితేనో, ఇంకేదయినా అవాంఛిత సంఘటన జరిగితేనో క్రికెట్ మ్యాచ్ లో డక్ వర్త్ లూయీస్ పద్దతిలో ఓవర్లను కుదిస్తారు. కానీ, ఇంగ్లాండ్ లో ఓ దొంగ క్రికెట్ మ్యాచ్ ను 30 ఓవర్లకు కుదించేలా చేశాడు. వివరాల్లోకి వెలితే... లండన్ లో చర్చ్, హస్లింగ్ టన్ జట్ల మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ కు ముందు ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో తమ వస్తువులన్నీ పెట్టి మైదానంలో దిగారు.
ఇంతలో ఫీల్డింగ్ చేస్తున్న జట్టులో వికెట్ కీపర్ డ్రెస్సింగ్ రూం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం గమనించాడు. అతనేం చేస్తున్నాడో గమనించేలోపు అతను మాయమయ్యాడు. అనుమానంతో డ్రింక్స్ టైంలో డ్రెస్సింగ్ రూంకు వెళ్లి పరిశీలించిన ఆటగాళ్లకు... వాళ్ల ఐ ఫోన్లు కనిపించలేదు. దీంతో అతను ఫోన్ల దొంగ అని తేలింది. జీపీఎస్ ఆధారంగా తమ ఫోన్లు ఎక్కడున్నదీ క్రికెటర్లు గుర్తించారు.
దీంతో పోలీసులకు సమాచారమిచ్చిన ఆటగాళ్లు ఫోన్ల దొంగను పట్టుకునేందుకు మైదానం వీడారు. ఇంతలో పోలీసులు జాగిలాలతో వచ్చారు. ఎలాగైతేనేం ఎట్టకేలకు క్రికెటర్లు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించి, మైదానానికి తిరిగి వచ్చారు. దీంతో అంపైర్లు మ్యాచ్ ను 30 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్ లో చర్చ్ జట్టు విజయం సాధించింది.