: ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ స్థాయి మెడికల్ కాలేజీ నిర్మిస్తాం: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి వల్ల ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా కళాశాలల్లో వసతులు, సౌకర్యాలు లేవని ఆ సంస్థ గతంలో చెప్పిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం విభజన సందర్భంగా హామీ ఇచ్చిందని, దీనిపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఈ మేరకు త్వరలోనే జాతీయ స్థాయి ఎయిమ్స్ వైద్య కళాశాల ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపు జరగలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సూచించానని ఆయన తెలిపారు. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మెడికల్ కళాశాలలు సౌకర్యాలు కల్పించకపోవడం కారణంగా విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు సౌకర్యాల కల్పనకు కేంద్రం సాయం చేయాల్సిందిగా సూచించానని ఆయన వెల్లడించారు. వీలైనంత తొందర్లో ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ను తనిఖీలకు పంపి, సౌకర్యాల లేమి, కల్పనపై ఆదేశిస్తానని కేంద్ర ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.