: సైకిల్ స్టాండ్ ను తలపించిన టీమిండియా... 105 పరుగులకే ఆలౌట్
టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. ఐపీఎల్ వీరులంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. వర్షం కారణంగా 41 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్ లో పూర్తి ఓవర్లు కూడా ఆడలేక కేవలం 25.3 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరుగుతున్న రెండో వన్డేలో రైనా సేన ఘోరంగా విఫలమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, బంగ్లా కొత్త బౌలర్ తస్కిన్ ఆహ్మద్ (5), మొర్తజా (2) ధాటికి విలవిల్లాడింది.
ముగ్గురు బ్యాట్స్ మన్ రన్ ఔట్ కావడంతో టీమిండియా ఓ మోస్తరు స్కోరు కూడా సాధించలేకపోయింది. టీమిండియా కెప్టెన్ సురేష్ రైనా సాధించిన 27 పరుగులే అత్యధికం కావడం విశేషం. కాగా ఊతప్ప(14), పుజారా (11) లు నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా తస్కిన్ అహ్మద్ కేవలం 28 పరుగులిచ్చి కీలకమైన 5 వికెట్లు తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 106 పరుగులు.