: బ్రెజిల్ గెలుస్తుందన్న తాబేలు
2010లో జరిగిన సాకర్ వరల్డ్ కప్ లో 'పాల్' అనే ఆక్టోపస్ చేసిన హంగామా అంతాఇంతా కాదు. మ్యాచ్ కు ముందే ఏ జట్టు గెలుస్తుందో అది జోస్యం చెప్పేది. అది చెప్పినట్టే మ్యాచ్ ల ఫలితాలు ఉండేవి. పాల్ చనిపోవడంతో... ఇప్పుడు 'బిగ్ హెడ్' అనే తాబేలు జాతకాలు చెప్పే స్థానాన్ని ఆక్రమించింది. సాకర్ ప్రపంచ కప్ లో ఈ రోజు జరిగే బ్రెజిల్, క్రొయేషియా మ్యాచ్ లో బ్రెజిలే విజేతని బిగ్ హెడ్ తేల్చేసింది. బ్రెజిల్ మారుమూల ప్రాంతమైన 'ప్రయాడు ఫోర్ట్'లో ఈ తాబేలు ఉంటోంది. దీని వయసు 25 ఏళ్లు. అది ఉండే నీటి కొలనుకు అమర్చిన మెష్ కు ఓ పక్క బ్రెజిల్ జెండా, మరో వైపు క్రొయేషియా జెండా, మధ్యలో ఫుట్ బాల్ ఉంచారు. ఈ మూడింటికీ కింద వైపు చేపలను వేలాడదీశారు. ఏ దేశానికి చెందిన జెండాకు వేలాడిన చేపలను తాబేలు తింటుందో ఆ దేశం గెలిచినట్టన్న మాట. ఒక వేళ ఫుట్ బాల్ కు వేలాడిన చేపలను తింటే ఆ మ్యాచ్ డ్రా అవుతుందంట. ఈ క్రమంలో మన 'బిగ్ హెడ్' వారు బ్రెజిల్ జెండా చేపలను తిన్నారు. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో బ్రెజిల్ గెలుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇదే జరిగితే 'బిగ్ హెడ్' బిగ్ సెలబ్రిటీ అయిపోవడం ఖాయం.