: ఆ సమయంలోనూ నలుగురిని రక్షించిన కిరణ్


అత్యంత క్లిష్టమైన సమయంలోనూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నలుగురి ప్రాణాలను కాపాడాడు. కానీ తనను మాత్రం రక్షించుకోలేకపోయాడు కిరణ్. అతను బియాస్ నదిలో గల్లంతైన వారిలో ఒకరైన ముప్పిడి కిరణ్ కుమార్. ఒకవైపు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బియాస్ నదీ జలాలు... మరో వైపు నీటిలో కొట్టుకుపోతున్న స్నేహితులు! ఏం చేయాలో ఆలోచించేంతగా సమయం కూడా లేదు. కిరణ్ కు సమీపంలోనే ప్రత్యూష అనే విద్యార్థినితో పాటు మరో విద్యార్థిని ఉన్నారు. వాళ్లిద్దరినీ కాపాడేందుకు కిరణ్ నదీ ప్రవాహంలోనే ఉండిపోయాడు. వారిలో పాటు మరో ఇద్దరినీ అత్యంత కష్టం మీద ఒడ్డుకు చేర్చాడు. కానీ, వారిని కాపాడిన కిరణ్ మాత్రం నీటిలో కొట్టుకుపోయాడు. ఇంతవరకూ అతని ఆచూకీ దొరకలేదు.

ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రత్యూష మాట్లాడుతూ.. "నీటిమట్టం పెరుగుతున్నట్లు గుర్తించగానే కిరణ్ ప్రమాదాన్ని ఊహించి మమ్మల్ని ఒడ్డువైపు నెట్టేశాడు. మేమంతా ఒడ్డుకు చేరుకుని, కిరణ్ ఎక్కడున్నాడా అని చూశాం. అతడు నీళ్లలోంచి బయటకు రావడానికి కష్టపడుతున్నట్లు మాకు అర్థమైంది. అతడు ఎలాగైనా వస్తాడన్న ఆశతోనే మేం చాలాసేపు ఎదురుచూశాం. కానీ, కింద ఉన్న రాయి కొట్టుకుపోవడంతో కిరణ్ నీటిలో పడి కొట్టుకుపోయాడు" అని చెప్పింది. అయితే తన కుమారుడికి ఈత బాగా వచ్చని, అతడు ఎలాగోలా ఎక్కడో ఒక చోట సురక్షిత ప్రాంతానికి చేరుకునే ఉంటాడని కిరణ్ తండ్రి వెంకటరమణ చెప్పారు.

  • Loading...

More Telugu News