: డ్యామ్ నుంచి నీళ్లు తగ్గించి మృతదేహాల కోసం గాలింపు
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిపై లార్జి డ్యామ్ నుంచి దిగువకు నీటి మట్టాన్ని తగ్గించి గల్లంతైన తెలుగు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు దిగువన 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండా డ్యామ్ ఒక గేటును పైకి ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. మృతదేహాలు కొట్టుకుపోకుండా అక్కడ వల ఏర్పాటు చేశారు. లార్జి డ్యామ్ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నదీ భాగం లోతైన ప్రాంతం కావడం, నది అడుగున బురద ఉండడం వల్ల సహాయక చర్యలకు ప్రతికూలంగా మారింది. దీంతో ఆలస్యంగానైనా మృతదేహాలను వెలికి తీయడం ఖాయమని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారి జైదీప్ సింగ్ వెల్లడించారు. ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టమని, పది రోజులు కూడా పట్టవచ్చన్నారు. 10 పడవలతో రెండు ప్రాజెక్టుల మధ్య విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.