: పబ్ లో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన... ప్రశ్నిస్తే కాల్పులు
ముంబైలో తాగుడు తలకెక్కిన ఓ వ్యక్తి ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. క్షమాపణలు చెప్పాలని కోరగా కాల్పులు జరిపాడు. ఎస్కేప్ పబ్ లో ఇటీవలే జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బంగారు ఆభరణాల వర్తకుడు విక్రమ్ కల్లోడి పబ్ లో ఓ యువతి దగ్గర ఫోన్ ను గుంజుకోవడానికి ప్రయత్నించాడు. దాన్ని ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అతడు ఆమె చేతులు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. మేనేజర్ జోక్యం చేసుకుని ఆమెకు క్షమాపణలు చెప్పాలని విక్రమ్ ను కోరాడు. అందుకు అతడు నిరాకరించడమే కాకుండా తుపాకీ తీసి మేనేజర్ కాలిపై కాల్చాడు. సరిగ్గా తనిఖీలు చేయకపోవడం వల్లే అతడు తుపాకీని లోపలికి తీసుకెళ్లగలిగాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై లైంగిక వేధింపుల కేసుతో పాటు, హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.