: ముండే పార్టీ నుంచి వైదొలగాలనుకున్నారు: బీజేపీ ఎమ్మెల్సీ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే బీజేపీ నుంచి వైదొలగాలనుకున్నట్లు ముంబైకి చెందిన పార్టీ ఎమ్మెల్సీ పాండురంగ్ పున్ ద్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, పార్టీలో ముండే ప్రతి విషయంలోనూ సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ క్రమంలో ఒకానొక సమయంలో పార్టీని వదిలి వెళ్లి పోవాలనుకున్నట్లు వివరించారు. అయితే, ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానన్నారు. అనేకసార్లు ముండే అవమానాలు కూడా ఎదుర్కొన్నారని చెప్పిన ఆయన, తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశాడని పేర్కొన్నారు. గతంలో ముండేకు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు మంత్రి పదవులు ఆఫర్ చేసిందని ఈ సందర్భంగా పున్ ద్కర్ బయటపెట్టారు. ఇదిలావుంటే ఆయన మృతికి దారి తీసిన పరిస్థితులపై ప్రజల్లో చాలా గందరగోళం ఉందని, ఈ విషయంలో కచ్చితంగా సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.