: రగులుతున్న నందమూరీయం!
నందమూరి ఫ్యామిలీలో కోల్డ్ వార్ జరుగుతోందనీ.. టీడీపీ అధినేత చంద్రబాబు తీరు హరికృష్ణ, జూ. ఎన్టీఆర్ కు ఏమాత్రం మింగుడు పడడం లేదని కొంతకాలంగా మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు చంద్రబాబు తనయుడు లోకేష్ ను రాజకీయంగా పైకి తెచ్చే క్రమంలో జూనియర్ ను అణగదొక్కే కుట్ర జరుగుతోందని కూడా తెలుగుదేశం పార్టీలో ఓ వర్గం ఆగ్రహం వెళ్లగక్కిన సందర్భాలు వెలుగుచూస్తున్నాయి. ఈ తరహా ఆగ్రహావేశాలు ప్రదర్శించి ఏకాంగా టీడీపీ అధినేత చంద్రబాబు మీదే తీవ్రస్థాయిలో దుమ్మత్తిపోశారు కొడాలి నాని.
జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి చాలాకాలంగా మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో పై ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లైంది. కొడాలి నాని టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిపోయింది. మరో టీడీపీ కీలక నేత వల్లభనేని వంశీ కూడా పార్టీకి దూరంకానున్నారని ఊహాగానాలు ఆమధ్య జోరందుకున్నాయి. దీంతో కృష్ణాజిల్లాలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఈ పరిణామక్రమంలో జిల్లాలోని పలు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీల్లో జూ. ఎన్టీఆర్ ఫొటోలూ దర్శనమిస్తున్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రోద్భలంతోనే నేతలు టీడీపీని వీడుతున్నారన్న మీమాంస ఆ పార్టీనేతల్లోనూ, నందమూరి అభిమానుల్లోనూ మొదలైంది.
ఇలా పరిస్థితులు జటిలంగా మారిన క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలపై స్పందిస్తారని, ఇలాంటి చర్యలను ఖండిస్తారని అటు నందమూరి ఫ్యామిలీ, టీడీపీ నేతలు కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. అయినా ఎన్టీఆర్ నుంచీ ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇదంతా ఒకెత్తయితే, నిన్న బాలకృష్ణ కృష్ణాజిల్లా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని తార స్థాయికి తీసుకువెళ్లాయి. ప్లెక్సీల వ్యవహారం మీద ఎన్టీఆర్ వివరణ ఇవ్వాల్సిఉందని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నందమూరి బాలయ్య, జూనియర్ కు దాదాపు హెచ్చరిక చేసిననంత పనిచేశారు. దీంతో నిన్ననే జూనియర్ స్పందిస్తారని అంతా అనుకున్నారు. అంతేకాదు.. వైఎస్ఆర్ సీపీ నేతలు తన ఫోటోలు పెట్టుకోవడం దురదృష్టకరమని ఖండన ప్రకటన చేస్తారని అటు టీడీపీ కీలకనేతలు, నందమూరి ఫ్యామిలీ మెంబర్లు ఆశగా ఎదురు చూశారు.
అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం స్పందించలేదు. దీంతో జూనియర్ సమరానికే సై అంటున్నారని భావన అందరిలోనూ రేగుతోంది. మరోపక్క జూనియర్ అభిమానులు నిన్న బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తమ అభిమాన నటుడి సినిమా 'బాద్ షా' విడుదల సందర్భంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు కుట్రతో కూడుకున్నవని వారు ఆరోపిస్తున్నారు. గతంలో 'ఊసరవల్లి' సినిమా విడుదల సందర్భంలోనూ ఇలాగే సినిమా చూడొద్దంటూ కొందరు జూనియర్ కు వ్యతిరేకంగా ప్రచారం సాగించారని ఆరోపిస్తున్నారు. దీంతో మామయ్య - బాబాయ్ - అబ్బాయ్ కథ ఏ మలుపు తీసుకుంటుందోనని అందరిలోనూ ఉత్కంఠ తారస్థాయికి చేరింది.
ఇలా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్లెక్సీలు నందమూరి ఫ్యామిలీ, టీడీపీ పార్టీలో గందరగోళ పరిస్థితులకు తావిచ్చాయి.