: రేపటిలోగా దేశంలోకి 'రుతు' రాగాలు.. వర్షపాతం తక్కువే
నైరుతి రుతుపవనాలు గురువారంలోగా కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు కేరళను తాకి, దక్షిణ అరేబియా మహాసముద్రం, మాల్దీవుల్లోని అన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. అంతేకాకుండా వచ్చే 72 గంటల్లో ఉత్తరాది ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించడానికి అవకాశాలున్నట్లు తెలిపింది. ఇప్పటికే రుతుపవనాల రాకను తెలియజేస్తూ ఒడిశా, అసోం, గోవా, కర్ణాటకలోేని తీర ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నట్లు వివరించింది. నాలుగేళ్ల తర్వాత దేశంలో ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నట్లు తెలిపింది. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం 95 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కేరళను తాకిన ఐదు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తాయి.