: నాడు ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి.. నేడు విడిపోతున్న సందర్భం
మరొక్క రాత్రి గడిస్తే విశాల తెలుగు రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోతుంది. ఇన్నాళ్లు ఒకే రాష్ట్రంగా కలసి ఉన్న తెలుగు వారు ఇకపై రెండు రాష్ట్రాల్లో ఉన్నట్లు అవుతుంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో భాగంగా లేరు. ఆ తర్వాతే ఒక రాష్ట్రంగా ఏర్పడి ఇన్నాళ్ల తర్వాత విడిపోతున్నారు. అసలు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర ప్రాంతాలు కలసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించడానికి గల కారణాలు... ఇప్పడు విడిపోవడానికి దారి తీసిన పరిస్థితుల గురించి క్లుప్తంగా ఓసారి తెలుసుకుందాం.
భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన మేరకు తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్సార్సీ) హైదరాబాద్ సంస్థానం పరిధిలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఒకటిగా ఏర్పాటు చేయాలని సూచించడంతో 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అలాగే, హైదరాబాద్ సంస్థానం పరిధిలోని మిగిలిన ప్రాంతాలలో మరాఠీ మాట్లాడే వాటిని మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలో కలపాలని నాడు ఎస్సార్సీ సిఫారసు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించే క్రమంలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. 12 ఏళ్ల తర్వాత వాటి అమలు విషయంలో తెలంగాణ ప్రాంతవాసుల్లో అసంతృప్తి మొదలైంది. 1969 జనవరి 19న దీనిపై ఆందోళన తలెత్తడం, పలు ప్రాంతాల్లో ఆందోళన కారులను అదుపు చేయడం కోసం పోలీసు కాల్పులు జరిపే వరకు పరిస్థితులు దారి తీశాయి. ఆర్మీని కూడా రంగంలోకి దింపారు.
ఇరు ప్రాంత నేతల చర్చల అనంతరం 1969 ఏప్రిల్ 12న ప్రధాని ఎనిమిది సూత్రాల కార్యక్రమంతో ముందుకు వచ్చారు. దాన్ని తెలంగాణ నేతలు వ్యతిరేకించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేసింది. ఆ సమయంలో ముల్కి నిబంధనలు అమల్లో ఉన్నాయి. దాంతో ఏ ప్రాంతం వారైనా సరే 15 ఏళ్ల పాటు హైదరాబాద్ లో నివసిస్తే స్థానికులుగా పరిగణించడంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలకు విద్యార్హత లభించేది. 1972లో సుప్రీంకోర్టు ముల్కి నిబంధనలను నిలిపివేసింది. దీంతో జై ఆంధ్రా ఉద్యమం మొదలైంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కొందరు ఉద్యమించారు. 1973 సెప్టెంబర్ 21న రెండు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఆరు సూత్రాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ, ఆచరణలో ఇది విఫలమైందంటూ తెలంగాణ ప్రాంతంలో ఆందోళన మొదలైంది. నియామకాల్లో ఉల్లంఘనలను సరిచేసేలా ప్రభుత్వం జీవో 610ని అమలు చేసింది. ఉల్లంఘనలను పరిశీలించేందుకు చంద్రబాబు హయాంలో 2001లో ప్రభుత్వం గిర్ గ్లానీ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
1997లో బీజేపీ ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానించింది. 2000లో కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు.. తెలంగాణ లేజిస్లేచర్స్ ఫోరంగా ఏర్పడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని అధినేత్రి సోనియాకు వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ నేత కేసీఆర్ 2001 ఏప్రిల్ లో ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. ఆ పొత్తులో భాగంగానే కాంగ్రెస్ ఏకాభిప్రాయం వస్తే తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలోనూ దాన్ని చేర్చింది. అయితే, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ ఉద్యమం కాస్త శాంతించింది.
కానీ, 2009 సెప్టెంబర్ లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో తెలంగాణ ఉద్యమం కొత్త మలుపు తీసుకుంది. తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష చేయడంతో 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడతున్నట్లు కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం ప్రకటించారు. దాంతో సీమాంధ్రలో ఆందోళన పెద్ద ఎత్తున లేచింది. దాంతో అందరి సమ్మతి లభించే వరకూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెట్టబోమంటూ అదే నెల 23న కేంద్రం మరో ప్రకటన చేసిింది. ప్రభుత్వం 2010 ఫిబ్రవరిలో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ అధ్యయనం చేసి తెలంగాణ ఏర్పాటు సహా ఆరు ఆప్షన్లు ఇచ్చింది. ఆ తర్వాత 2011లో తెలంగాణలో సకల జనుల సమ్మె పెద్ద ఎత్తున జరిగింది.
సీపీఎం మినహా అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అభ్యంతరం లేదని తెలియజేయడంతో... చివరికి 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని తీర్మానిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దాన్ని కేంద్రానికి పంపడంతో.. కేంద్ర కేబినెట్ అక్టోబర్ 3న ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత నుంచి సీమాంధ్రలో పెద్ద ఎత్తున సమ్మె మొదలైంది. అయినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి లైన్ క్లియర్ చేసింది.
2013 డిసెంబర్ 6న కేబినెట్ నుంచి తెలంగాణ బిల్లు రాష్ట్రపతికి వెళ్లగా, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చింది. జనవరి 23 వరకు అభిప్రాయాలు చెప్పడానికి సమయం ఇచ్చారు. శాసనసభలో చర్చ తర్వాత చివరికి బిల్లు తప్పుల తడకగా ఉందని, దాన్ని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూ బిల్లును వెనక్కి పంపారు. ఆ బిల్లును రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ కు పంపించారు. దానికి ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమోద ముద్రపడింది. ఫిబ్రవరి 13న లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిపోయింది. ఫిబ్రవరి 18న ఆమోద ముద్ర వేయగా... రాజ్యసభలో 20న ఆమోదం లభించింది. దాంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి మార్గం సుగమమైంది.