: మోడీతో చంద్రబాబు ఏం మాట్లాడారు?
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రధాని మోడీతో పాటు ఏకంగా 11 మంది కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. దాదాపు 20 గంటలపాటు ఆయన వరుస భేటీలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో ఆయన ఏమేం చర్చించారో ఓ సారి చూద్దాం.
* ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలి.
* ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలి.
* ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ తరహాలో పారిశ్రామిక పన్ను రాయితీలు కల్పించాలి.
* రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలి.
* లోటు బడ్జెట్ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణతో సమానంగా ఎదిగేవరకు సాయం అందించాలి.
* తొలి ఏడాది రూ. 13,579 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. దీన్ని తక్షణం సర్దుబాటు చేయాలి.
* ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్లో నేను ఆశలు రేకెత్తించాను. సున్నా నుంచి మొదలు పెట్టి అభివృద్ధి వైపు పరుగులు తీయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కేంద్రం కూడా చొరవ తీసుకోవాలి.
* ప్రత్యేక ఏపీ సెల్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి.
* రుణమాఫీల హామీని అమలు చేయడానికి కేంద్రం తన వంతు సాయం అందించాలి.
* హైదరాబాదును తెలంగాణకు ఇవ్వడంతో... ఏపీకి ఆదాయం లేకుండా పోయింది.
* కొత్త రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వడానికి కూడా నిధులు లేవు. ప్రణాళికా సంఘానికి చెప్పి జీతాలకు డబ్బులివ్వండి.
* కొత్త రాజధానికి 30 టీఎంసీల నీరు కేటాయించండి.