: రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీదే విజయం: నన్నపనేని రాజకుమారి
రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, మహానాడును మాత్రం కలిసే జరుపుకుందామని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. మహానాడులో ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం మహానాడును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కాకుండా, ఒకే చోట జరుపుకుందామని అన్నారు. వచ్చే సంవత్సరం మహానాడును ఆంధ్రాలో పెట్టినా, తెలంగాణలో జరిపినా అందరం అక్కడికి వస్తామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.
చంద్రబాబు వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, పార్టీని విజయపథాన నడిపించారనీ అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పాదయాత్రను కొనసాగించారని నన్నపనేని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీమాంధ్రలో 100 సీట్లు గెలుచుకున్నామని, తెలంగాణలో 20 సీట్లు వచ్చాయని రెండింటిని కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటే చంద్రబాబే ముఖ్యమంత్రి అయ్యేవారని అన్నారు. అందుకే రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీదే విజయమని ఆమె స్పష్టం చేశారు.