: నల్లధనాన్ని వెలికితీస్తాం... ఇదే మా చిత్తశుద్ధిని నిరూపిస్తుంది: కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్


కేంద్ర కేబినెట్ తొలి సమావేశం చర్చల వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించేందుకు చిత్తశుద్ధితో పని చేస్తామని అన్నారు. ఇందు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని, సుప్రీంకోర్టు ఆదేశానుసారం పని చేసేందుకు పటిష్టమైన ప్రత్యేక బృందాన్ని నియమించామని ఆయన స్పష్టం చేశారు.

దర్యాప్తు బృందానికి జస్టిస్ ఎమ్.బి. షా నేతృత్వం వహించనున్నారని, వైస్ చైర్మన్ గా జస్టిస్ అరిజిత్ పసాయత్ వ్యవహరిస్తారని చెప్పారు. నల్లధనం వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నందున దర్యాప్తు బృందంలో అత్యుత్తమ అధికారులు పని చేయనున్నారని తెలిపారు. రా డైరెక్టర్, సీబీఐ డైరెక్టర్, ఎన్ ఫోర్ట్ మెంట్ డైరెక్టర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ బోర్డు డైరెక్టర్, సెంట్రల్ రెవెన్యూ డైరెక్టర్, సెంట్రల్ ఫైనాన్షియల్ చీఫ్ డైరెక్టర్ లు సభ్యులుగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

నిబద్ధతతో, నిజాయతీతో నల్లధనం వెలికి తీస్తామని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో జరిగిన రైల్వే దుర్ఘటనలో మృత్యువాత పడినవారి బంధువులను ఓదార్చేందుకు, క్షతగాత్రులకు అవసరమైన సహాయ, సహకారాలు అందజేసేందుకు వెళ్లాలని కేంద్ర రైల్వే మంత్రికి మోడీ సూచించారని ఆయన తెలిపారు.

అలాగే ప్రధాని ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ఆయన సూచించారు. మరణించిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలు, క్షతగాత్రులకు 20 వేల రూపాయలు అందజేయాలని మోడీ సూచించారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News