: సిసలైన సినిమాకు అసలైన 'ముగింపు'!


ఈ ఉదంతం వింటే సినిమా కథలూ బలాదూర్! ఏ దర్శక దిగ్గజానికీ తీసిపోని పక్కా స్క్రిప్టు వర్క్! మూడు దశాబ్దాలకు పైగా కోర్టులకు సైతం ముందరికాళ్ళకు బంధం వేసిన పకడ్బందీ స్క్రీన్ ప్లే! ఈ పరిభాష అంతా చూస్తుంటే ఏదో సినిమా కథకు ముందుమాటలా అనిపిస్తోంది కదూ. అవును, సినిమా స్టోరీలను తలదన్నేలా ఈ సంఘటన జరిగింది. దాని పూర్వాపరాలేంటో ఓసారి చూద్దాం.

30 ఏళ్ళ క్రితం ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లాలో పోలీసులు.. ఓ డీఎస్ పీ తోపాటు 12 మంది గ్రామస్తులను బూటకపు ఎన్ కౌంటర్ చేసిన కేసులో సీబీఐ కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 8 మంది పోలీసులను ముద్దాయిలుగా కోర్టు పేర్కొంది. వారిలో ముగ్గురికి మరణశిక్ష విధించింది. మొత్తం 19 మంది పోలీసులపై ఛార్జిషీటు నమోదు చేయగా, వారిలో విచారణ కాలంలో పది మంది మరణించారు. మరో ఏడుగురు సర్వీసు నుంచి రిటైరయ్యారు.

ఇంత సంచలనం సృష్టించిన సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే, 80వ దశకంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అది మార్చి 12, 1982. రాత్రివేళ.. గోండా జిల్లాలోని మాధవ్ పూర్ గ్రామం నిద్రలో జోగుతోంది. మాధవ్ పూర్ పోలీసు సిబ్బందితో పాటు చుట్టుపక్కల పోలీసు స్టేషన్ల సిబ్బంది కూడా ఆ చిన్న గ్రామానికి చేరుకున్నారు. చూసినవాళ్ళకు అక్కడ ఏదో జరగబోతోందన్న విషయం అర్థమై ఉంటుంది.

కానీ, ఆ పోలీసుల రాక వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉందన్న సంగతి వాళ్ళకు అర్థమయ్యేలోపే జరగరాని దారుణం జరిగిపోయింది. తనపై అంతర్గత విచారణకు ఆదేశించడాన్ని మనసులో పెట్టుకున్న మాధవ్ పూర్ ఎస్సై సరోజ్.. డీఎస్ పీ కేపీ సింగ్ ను హతమార్చాలని నిర్ణయించుకున్న క్రూరమైన క్షణాలవి. కానిస్టేబుళ్ల సహకారంతో డీఎస్ పీ సింగ్ తో పాటు మరో 12 మంది గ్రామస్తులను బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేశాడు సరోజ్. ఆ ఘటనపై ఆ హంతక ఎస్సై ఎలా కట్టుకథను అల్లాడో చూడండి.

హతులైన గ్రామస్తులపై బందిపోట్ల ముద్ర వేశాడు. వారు మొదట డీఎస్ పీని కాల్చి చంపారని.. దీంతో తాము ఆ బందిపోట్లను హతమార్చామని పై అధికారులకు వివరించాడు. అయితే, నిజం నిప్పులాంటిది. డీఎస్ పీ భార్య విభా సింగ్ కేసు దాఖలు చేయగా.. ఓ గ్రామస్తుడు సాక్ష్యం చెప్పేందుకు ముందుకురావడంతో వీరి పాపం ఇలా పండింది. ఏదేమైనా న్యాయం గెలిచింది. అన్యాయానికి శిక్ష పడింది.

  • Loading...

More Telugu News