: షారూఖ్, అక్షయ్ ల మధ్య బెడిసిందా..?
బాలీవుడ్ లో అంతే! అక్కడి సూపర్ స్టార్లు తమకంటే తక్కువ స్థాయి ఉన్న హీరోలతో చక్కగా కలిసిపోతారు గానీ, తమ సమవుజ్జీలతో మాత్రం ఎడమొహం పెడమొహంగా ఉంటారు. అసూయో, అహంభావమో.. తెలియదు కానీ, ఒకే కార్యక్రమానికి హాజరైనా ఒకరికి ఒకరు తెలియనట్టే వ్యవహరిస్తారు.. అని ముంబయి వర్గాల భోగట్టా. బాలీవుడ్ లో బాద్షా బిరుదాంకితుడు షారూఖ్ ఖాన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
గతంలో సల్మాన్ ఖాన్ తో వైరం నెరిపిన ఈ కింగ్ ఖాన్ కు తాజాగా అక్షయ్ కుమార్ తోనూ పొసగడంలేదని వినికిడి. అందుకు సాక్ష్యంగా మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ను ఉదహరించాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ లో షారూఖ్ సొంత జట్టు కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు కోల్ కతాలో పోటీపడిన సంగతి తెలిసిందే.
తాజాగా 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబయి-2' చిత్రంలో నటిస్తున్న అక్షయ్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తన చిత్ర బృందంతో స్టేడియంలోకి విచ్చేశాడు. ఆ సమయంలో తన జట్టును ఉత్సాహపరుస్తోన్న షారూఖ్.. అక్షయ్ అండ్ గ్యాంగ్ ను గమనించి వారు స్టాండ్స్ లో ఉన్నంతసేపూ కెమెరా అటువైపు అస్సలు ఫోకస్ చేయవద్దంటూ కెమెరామెన్ కు సూచించాడట. దీనికంతటికీ కారణమేమిటి చెప్మా? అని సినీ జీవులు చెవులు కొరుక్కుంటున్నారు.