: తెలంగాణ వచ్చిన విషయాన్ని చంద్రబాబు ఇంకా గుర్తించనట్టున్నారు: కోదండరాం
తమ డిక్షనరీలో రెచ్చగొట్టడం అనేది లేదని... కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు డిక్షనరీలో ఆ ఒక్క పదం మాత్రమే ఉందని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే భావన చంద్రబాబుకు ఇంకా కలగనట్టుందని అన్నారు. తెలంగాణలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అనడం... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అగౌరవపరచడమే అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ ఏర్పాటులో బిజీగా ఉండడం వల్లే తమతో కలవలేకపోయారని... దీన్ని ఇష్యూ చేయరాదని మీడియాను కోరారు. 'కేసీఆర్ మా వాడు... ఆయన్ను ఎప్పుడైనా కలుస్తా'మని చెప్పారు.
ఉద్యోగుల పంపిణీలో తెలంగాణ వారికి అన్యాయం జరగకూడదని కోదండరాం చెప్పారు. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతాల్లోనే ఉండాలని తెలిపారు. తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేకూరేంతవరకు టీజేఏసీ పోరాడుతుందని తెలిపారు. ఉద్యోగులు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా జెండా ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు.