: ఏపీ అభివృద్ధికి మోడీ అవసరం ఉంది: జగన్
కాబోయే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసేందుకు ఢిల్లీ బయలుదేరిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ ఎంపీలు కొద్దిసేపటి కిందట హస్తిన చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన జగన్, రాష్ట్ర విభజనపై ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని మోడీని కోరతామని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోడీ అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు. సార్వత్రిక ఫలితాల్లో బీజేపీ మంచి మెజార్టీ సాధించిందని, తమ ఎంపీల మద్దతు మోడీకి అవసరం లేదనీ అన్నారు. అవసరమైతే ఎన్డీఏకు అంశాల వారీగా మద్దతు తెలుపుతామన్నారు. తామెప్పుడూ మోడీకి వ్యతిరేకం కాదని జగన్ స్పష్టం చేశారు. కాగా, మరికాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ను జగన్ కలవనున్నారు.