: అత్యధిక మెజారిటీ సాధించడంలో కేసీఆర్ టాప్


సార్వత్రిక ఎన్నికల్లో తెలుగునేలపై అత్యధిక మెజారిటీ సాధించడంలో కేసీఆర్ ముందు నిలిచారు. ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కేవలం తెలంగాణలోనే కాకుండా... ఆంద్రప్రదేశ్ మొత్తానికి కేసీఆర్ అత్యధిక ఓట్లు సంపాదించుకుని రికార్డు బద్ధలుకొట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కేసీఆర్ 3,97,029 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ పై ఘన విజయం సాధించారు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెజార్టీని ఆయన అధిగమించారు.

మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇందిరాగాంధీ సాధించిన 2,19,214 ఓట్ల మెజార్టీనే అత్యధికంగా ఉంది. మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని గజ్వేల్ అసెంబ్లీ నుంచి కూడా కేసీఆర్ పోటీ చేశారు. అక్కడ కేవలం 19,218 ఓట్లతో కేసీఆర్ విజయాన్ని అందుకున్నారు. ఇక, మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి అత్యల్ప ఓట్ల మెజార్టీ సాధించారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జైపాల్ రెడ్డిని ఓడించి... కేవలం 2,590 ఓట్ల మెజార్టీతో జితేందర్ రెడ్డి గెలుపొందారు.

  • Loading...

More Telugu News