: యజమాని కొడుకును కాపాడిన పిల్లి
విశ్వాసానికి మారుపేరు కుక్క అని చెప్పుకుంటాం. కానీ, ఈ ఘటన తెలుసుకున్న తర్వాత అది రాంగ్ అంటారు. సాధారణంగా కుక్కలను చూస్తే పిల్లులు పరుగు లంకించుకుంటాయి. ఎందుకంటే, దొరికితే చంపేస్తాయనే భయం. కానీ, ఓ పిల్లి మాత్రం తన యజమాని కొడుకును ఓ వీధి కుక్క బారి నుంచి కాపాడడం కోసం ఆ భయాన్ని పక్కన పెట్టి సాహసాన్ని ప్రదర్శించింది.
ఇంటి ముందు చిన్నారి సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్నాడు. ఇంతలో వీధి కుక్క వచ్చి అతడి కాలుని నోటితో గట్టిగా పట్టి ఈడ్చుకుని పోబోయింది. అది చూడడం ఆలస్యం... ఆ బాలుడి పెంపుడు పిల్లి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి కుక్కను తన శరీరంతో గట్టిగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు కుక్క బాలుడిని విడిచి పరారయ్యింది. ఇంతలోనే బాలుడి తల్లి అక్కడికి రాగా, చిన్నారి లేచి ఇంట్లోకి వెళ్లిపోయాడు.
కుక్క దాడిలో బాలుడి కాలిపై పెద్ద గాయలయ్యాయి. కానీ, ప్రేమతో పెంచుకున్న పిల్లి చూపిన ధైర్యం వల్ల అతడి ప్రాణాలు మిగిలాయి. పెంపుడు పిల్లుల్లోనూ విశ్వాసం మెండు అనడానికి ఇదొక నిదర్శనం. ఈ వీడియో యూట్యూబులో పెద్ద సంచలనం కలిగిస్తోంది. ఈ నెల 13న జరిగిన ఈ ఘటన వీడియోను యూట్యుబులో పెడితే మొదటి రోజే 40లక్షల మంది చూసేశారు.