: మర్డర్ కేసులో నటి శృతి కోసం పోలీసుల గాలింపు
నటుడు పీటర్ ప్రిన్స్ (35) హత్య కేసులో దోషిగా తేలిన నటి శృతి చంద్రలేఖ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పీటర్, శృతి ఇద్దరూ గత కొంత కాలంగా చెన్నైలోని మదురవాయల్ ప్రాంతంలో సహజీవనం చేస్తున్నారు. బెంగళూరులో సహాయ నటుడిగా పనిచేస్తూ పీటర్ కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ సందర్భంలో నటి శృతితో అతనికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ చైన్నైకు మకాం మార్చారు.
ఈ క్రమంలో గత జనవరి 13న తన సొంత ఊరు సెల్లై జిల్లా పరప్పాడికి వెళ్లి చెన్నై తిరిగి వస్తుండగా పీటర్ అదృశ్యమయ్యాడు. ఫిబ్రవరి 1న పీటర్ కనిపించడం లేదని శృతి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. దీనికి తోడు పీటర్ సోదరుడు కూడా పీటర్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు... కిరాయి హంతకులు ఆన్సట్రాజ్, గాంధిమదినాథన్ లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారందించిన సమాచారం ప్రకారం కీలక నిందితుడు జాన్ ప్రిన్సెన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అతను అన్ని వివరాలను వెల్లడించాడు.
జాన్ ప్రిన్సెస్ వివరాల ప్రకారం... తాను, పీటర్, ఉమాచంద్రన్ లు కలసి ఆన్ లైన్ వ్యాపారం చేశారు. నష్టాలు రావడంతో పీటర్ బెంగళూరు వెళ్లి నటుడిగా సెటిలైపోయాడు. బాగా డబ్బు సంపాదించిన అనంతరం శృతితో కలసి చైన్నై వచ్చేశాడు. తర్వాత పీటర్ కు మరి కొంత మంది మహిళలతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పీటర్ కు, శృతికి మధ్య విభేదాలు తలెత్తాయి. పీటర్ దగ్గరున్న కోట్లాది రూపాయలపై కన్నేసిన శృతి... పీటర్ ను చంపేందుకు ప్లాన్ వేసి... తమను సంప్రదించినట్టు జాన్ ప్రిన్సెస్ తెలిపాడు.
అందరికీ పీటర్ ఉమ్మడి టార్గెట్ కావడంతో... అందరం కలసి హత్య చేసినట్టు పోలీసులకు జాన్ తెలిపాడు. అనంతరం పీటర్ డెడ్ బాడీని కారులో తీసుకెళ్లి ఆశీర్వాదం అనే ప్రాంతంలో పాతిపెట్టామని చెప్పాడు. దీంతో పీటర్ మృతదేహాన్ని జాన్ సహాయంతో పోలీసులు తవ్వి బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన నటి శృతి చంద్రలేఖతో పాటు ఉమాచంద్రన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.