: ప్రియురాలి బెదిరింపుతో విషం తాగేసిన వివాహితుడు!
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటం అంటే ఇదేనేమో... పెళ్లి చేసుకుంటావా? లేక విషం తాగమంటావా? అంటూ ప్రియురాలు తెచ్చిన ఒత్తిడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హైదరాబాదు, చిలకలగూడ శ్రీనివాసనగర్‌కు చెందిన పీఎల్‌వీ సత్యనారాయణ (35) ప్రైవేటు ఉద్యోగి. శ్రద్ధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు పుట్టలేదు.
తరువాత కొంత కాలానికి సత్యనారాయణకు సహఉద్యోగిని జయతో సాన్నిహిత్యం పెరిగింది. దీంతో వారు దగ్గరయ్యారు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని సత్యనారాయణను ఒత్తిడి చేసేది. ఈ విషయంపై వారిరువురు పలుమార్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో గత రాత్రి గుర్తుతెలియని విషం బాటిల్‌తో సత్యనారాయణ ఇంటికి జయ వచ్చింది. వస్తూనే ‘పెళ్లి చేసుకుంటావా?..లేదా ఈ విషం తాగి చావమంటావా?’ అంటూ అతని భార్య ముందే అతనిని నిలదీసింది.
భార్య ఎదురుగా ప్రియురాలు నిలదీయడాన్ని భరించలేని సత్యనారాయణ.. తానే తాగి చస్తానంటూ బాటిల్ గుంజుకుని గొంతులో పోసుకున్నాడు. దీంతో భార్య శ్రద్ధ అతన్ని సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.