: క్రికెట్ అభిమానులకు మజా పంచిన బెంగళూరు, రాజస్థాన్


ఐపీఎల్ 7లో ఉత్కంఠ విజయాలు టోర్నీని రక్తి కట్టిస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మజాను పంచింది. భీకరమైన బ్యాటింగ్ లైనప్, బలమైన బౌలింగ్ విభాగం కలిగిన బెంగళూరు... టోర్నీలో మూడవ స్థానంలో నిలిచింది. ఆరవ స్థానంలో ఉన్న రాజస్థాన్ తో తలపడింది. అత్యధిక మొత్తం పోసి కొనుక్కున్న యువరాజ్ కీలక మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించాడు.

38 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్స్ ల సాయంతో 83 పరుగులు చేశాడు. బౌలింగ్ లో కూడా 35 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చాడు. అయినా రాజస్థాన్ రాయల్స్ సమష్టితత్వం ముందు బెంగళూరు నిలవలేకపోయింది. 17వ ఓవర్ వరకు విజయం ఏకపక్షంగా బెంగళూరుదే అని అందరూ అనుకున్నారు. 18 బంతుల్లో 65 పరుగులు కావాలి ఇక క్రీజులో స్మిత్, ఫాల్కనర్ ఉన్నారు. దీంతో బెంగళూరే విజేత అంటూ కామెంటేటర్లు అనధికారికంగా ప్రకటించేశారు.

ఆ దశలో రాజస్థాన్ బ్యాట్సమెన్ జూలు విదిల్చారు. స్మిత్, ఫాల్క్ నర్ సింహాల్లా బెంగళూరు బౌలర్లను వేటాడేశారు. బౌలర్ ఎవరైన తమకు సంబంధం లేనట్టు వీర విహారం చేశారు. వీరి ధాటికి 17 బంతుల్లో 68 పరుగులు వచ్చాయంటే వారు ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశారో ఊహించుకోవచ్చు. స్మిత్ 21 బంతుల్లో 56 పరుగులు చేస్తే, ఫాల్కనర్ కేవలం 17 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. ఫాల్కనర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా, విశ్వరూపం చూపిన యువీ రిక్తహస్తాలతో ఓటమి భారంతో వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News