: ఇంతకీ రాష్ట్రపతి ఓటేస్తారా? వేయరా?
రాష్ట్రపతి ఓటేస్తారా? వేయరా? అనే సందేహం అందరికీ రావచ్చు. ఎందుకంటే, దేశంలో అందరినీ ఓటేయమని ప్రభుత్వం అంటోంది. కానీ, భారత్ లో రాష్ట్రపతి ఇప్పటివరకూ ఓటేయలేదు. ఎందుకంటే, రాష్ట్రపతికి రాజకీయం ఉండదు, పార్టీ ఉండకూడదు. అందుకే తాము నిష్పక్షపాతంగా ఉంటున్నామని చెప్పేందుకే రాష్ట్రపతిగా పనిచేసిన వారెవ్వరూ ఇంతవరకూ ఓటేయలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఓటేద్దామనుకున్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.
ప్రణబ్ ముఖర్జీ ఓటు బెంగాల్ లోని కోల్ కతా నియోజకవర్గంలోని రాస్ బిహారీ పోలింగ్ బూత్ లో ఉంది. అక్కడ ఈ నెల 12న పోలింగ్ జరుగనుంది. దక్షిణ కోల్ కతాలో కాంగ్రెస్ తరపున మాలా రాయ్, తృణమూల్ తరపున సిట్టింగ్ ఎంపీ సుబ్రత బాగ్చీ, బీజేపీ తరపున తథాగత రాయ్, సీపీఎం తరపున నందినీ ముఖర్జీలు బరిలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ప్రణబ్ అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేశారు. అయితే, చివరి నిమిషంలో ఆయన నిర్ణయం మార్చుకున్నారని తెలిసింది. ఇప్పటివరకూ రాష్ట్రపతిగా పనిచేసిన 13 మందిలానే ప్రణబ్ కూడా నిష్పాక్షికంగా ఉండాలని ఆయన డిసైడ్ అయ్యారట.