: ఈ మహానుభావుడు భారత రత్నమే... అందుకే రజనీకాంత్ తండ్రిగా స్వీకరించాడు!
ఎందరో మహానుభావులు...అందర్లోకి కల్యాణ సుందరమే గొప్పవాడవుతాడు. బక్కగా, పీలగా తెల్లని షర్టు, పంచెకట్టుతో సాధారణంగా కనిపించే కల్యాణ సుందరం దేవుడి ప్రతిరూపంలా కనిపిస్తాడు. ఆయన గత 30 ఏళ్లుగా తమిళనాడు ప్రభుత్వంలో లైబ్రేరియన్ గా విధులు నిర్వర్తించారు. ఆయన తన జీవితాన్ని సేవకు అంకితం చేశారు. ఈ 30 ఏళ్ల ఉద్యోగ ఫలితాన్ని (జీతం) అవసరంలో ఉన్న ఆర్తులకు అందజేశారు.
తన జీతంలో ఒక్క పైసా కూడా ఆయన వినియోగించుకోలేదు. ఆయన అవసరాలు తీర్చుకునేందుకు ఓ హోటల్ లో సర్వర్ గా పని చేస్తూ ప్రతిఫలం పొందుతున్నారు. అలా వచ్చిన డబ్బే ఆయన అవసరాలను తీరుస్తోంది. ఆయన రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన 10 లక్షల రూపాయలను ఆయన సేవకే వెచ్చించారు.
కల్యాణ సుందరం సేవను గుర్తించిన అమెరికాలోని సేవా సంస్థలు 'మేన్ ఆఫ్ ది మిలీనియం' గా గుర్తించాయి. ఈ పురస్కారం కింద వచ్చిన 30 కోట్ల రూపాయలను కూడా స్వచ్ఛంద సంస్థలకు కేటాయించారు కల్యాణ సుందరం. తన పెన్షన్ ను స్వచ్ఛంద సంస్థకు కేటాయించిన గొప్పమనిషి కల్యాణ సుందరం. గతేడాది ఆయనకు భారత రత్న ఇవ్వాలని రాష్ట్రపతిని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కోరాయి.
కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కల్యాణ సుందరంను తండ్రిగా స్వీకరించారు. ఇంత చేసినా, ఆయన తాను చేసిందేమీ లేదని నిరాడంబరంగా అంటారు. ఆయన ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నారు.