: 'రెంట్ ఏ ఫ్రెండ్' అంటున్న జపనీయులు..!
స్నేహాన్ని కట్ చేసినా... ఉల్లిపాయలు కట్ చేసినా కళ్ళల్లో నీళ్ళు వస్తాయని ఓ నూతన నానుడి. చెలిమిని ఇంత గొప్పగా విశ్లేషించిన ఆ వ్యక్తి ఎవరోగానీ హేట్సాఫ్ చెప్పాల్సిందే. కష్టాలు 'హాయ్' చెప్పినపుడు.. దేవుడి కన్నా మొదట గుర్తొచ్చేది ఫ్రెండ్సే కదా. స్నేహితుల విలువ అలాంటిది మరి. భూమండలం మీద మిత్రుల అవసరం ఉండని వాళ్ళు చాలా అరుదు.. అసలుండరేమో. అందుకే జపాన్ లో ఒంటరితనంతో బాధపడే వ్యక్తుల కోసం 'రెంట్ ఏ ఫ్రెండ్' కాన్సెప్ట్ ను ఆరంభించారు.
వీళ్ళ సేవలు ఎలా ఉంటాయంటే, మొదట మన వివరాలను, అభిరుచులను ఓ దరఖాస్తులో నింపాలి. దాన్నిబట్టి మన మనస్తత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులను మనతో స్నేహానికి పంపుతారు. ఇందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ అద్దె స్నేహితులు.. అమ్మాయి గానీ, అబ్బాయి గానీ.. సదరు వ్యక్తులకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు. అయితే, ఈ కిరాయి మిత్రులతో మనం పరిధికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. శ్రుతి మించితే పోలీస్ స్టేషన్ కెళ్ళాల్సి ఉంటుందండోయ్!