: ఇండో-పాక్ యుద్ధం నాటి ఫిరంగి గుండ్లు బయటపడ్డాయ్!
భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగిన 1971వ సంవత్సరానికి చెందిన రెండు ఫిరంగి గుండ్లు త్రిపురలోని శిపాహిజాలా జిల్లా కమలాసాగర్ గ్రామంలో బయటపడ్డాయి. ఎంజిఎన్ఆర్ఈజీఏ పథకంలో భాగంగా గ్రామంలోని సరస్సులో చేపట్టిన తవ్వకాల్లో ఇవి లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ఇదే ప్రాంతంలో గత మార్చి 13వ తేదీన మరో ఫిరంగి గుండు దొరికింది.
1971లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధానికి సాక్ష్యంగా మిగిలిన కమలానగర్ గ్రామం ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. సమాచారం అందుకున్న రాష్ట్ర పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫిరంగి గుండును నిర్వీర్యం చేసే సాంకేతిక పరిజ్ఞానం తమ బాంబ్ స్క్వాడ్ వద్ద లేదని, వాటిని ఆర్మీ అధికారులను అప్పగించామని వారు తెలిపారు.