: జగన్ ఓ దోపిడీదారుడు... ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరు: పవన్ కల్యాణ్
కేసీఆర్ ను తిట్టే ధైర్యం వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు లేదా? అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సీమాంధ్రులను కేసీఆర్ ఎందుకు తిడతారో అర్థం కావడం లేదని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని తెలిపారు. రాయలసీమ పచ్చగా కళకళలాడాలని... చంద్రబాబుకు అధికారం ఇస్తే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని చెప్పారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ ప్రసంగించారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ప్రజల సొత్తు అని... దాన్ని దోచుకోవాలని చూసే నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైకాపా అధినేత జగన్ ఎన్నటికీ సీమాంధ్రకు ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. వేలకోట్లు దోచుకున్న జగన్ ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చాడని... మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడో ప్రజలందరూ ఆలోచించాలని సూచించారు.