: ప్రతిదానికీ మోడీయేనా?...ఇది విమర్శలకు సమయం కాదు: ముక్తార్ అబ్బాస్
అసోంలోని బోడో ప్రాంతంలో ఉద్రిక్తతలపై రాజకీయ నాయకుల దుమ్మెత్తిపోతలు ఆరంభమయ్యాయి. మీరు కారణమంటే... మీరు కారణమంటూ పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్ మాట్లాడుతూ, బీజేపీ నడుపుతున్న విద్వేష రాజకీయాల ఫలితమే బోడో ప్రాంతంలో చెలరేగిన హింసాకాండ అన్నారు. దీనిపై బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ, కేంద్రంలో, అసోంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, అలాంటప్పుడు మోడీ ఎలా కారణమవుతారని ప్రశ్నించారు. ప్రతి దానికి నరేంద్ర మోడీని నిందించడం సరికాదని ఆయన హితవు పలికారు.
అసోంలో జరిగిన హింసాకాండ దురదృష్టకరమని, ఖండించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికి ఇది సమయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ మాట్లాడుతూ, శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, పరస్పరం నిందించుకోవడం మాని బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు.