: వీరూ డౌట్.. మెకల్లమ్ ఔట్..!


అవడానికి చిట్టిపొట్టి ఫార్మాట్ అయినా, గట్టి వినోదానికి ఘనమైన గ్యారంటీ ఇచ్చే నవతరం క్రికెట్ టీ20. అలాంటి జనరంజక క్రికెట్ కు శాశ్వత చిరునామాలా భాసిల్లుతోన్న ఐపీఎల్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు!?. రేపు మొదలయ్యే ఈ క్రికెట్ బొనాంజా ఈ వేసవిలో అభిమానులకు నిజంగా పండుగే. ఫ్యాన్స్ విషయం ఇలా ఉంటే.. ఆయా ఫ్రాంచైజీలు మాత్రం తమ ఆటగాళ్ళ ఫిట్ నెస్ పట్ల ఆందోళన చెందుతున్నాయి.

టోర్నీ ఆరంభం కాకముందే కీలక ఆటగాళ్ళు 'గాయా'లాపన చేస్తుండడంతో, ఈ పరిణామం ఆయా జట్ల యాజమాన్యాలను కలవరపెడుతోంది. ఇప్పటికే క్లార్క్, పీటర్సన్, రైడర్, మోర్కెల్ వంటి పలువురు ప్రముఖ ఆటగాళ్ళు గాయాల పేరిట వైదొలగిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రధాన ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండే విషయం ఖరారు కాలేదు. సెహ్వాగ్ వెన్ను సమస్యతో బాధపడుతున్నాడని కోచ్ ఎరిక్ సిమన్స్ వెల్లడించాడు. వీరూ జట్టులో ఇంకా చేరలేదని సిమన్స్ చెప్పాడు.

ఇక, విధ్వంసక విన్యాసాలకు అచ్చమైన పర్యాయపదంగా పేర్కొనదగ్గ కివీస్ వీరుడు బ్రెండన్ మెకల్లమ్ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ లో తొలి మ్యాచ్ లోనే 158 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ తో మెకల్లమ్ ఆ టోర్నీకి సిసలైన ఊపు తెచ్చాడు. ప్రస్తుతం తొడకండరాల గాయంతో సతమతమవుతున్న ఈ న్యూజిలాండర్ తాజా సీజన్ లో తొలి మ్యాచ్ కు దూరం అయ్యాడు. కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మెకల్లమ్.. బుధవారం డేర్ డెవిల్స్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండడంలేదని యాజమాన్యం పేర్కొంది. 

  • Loading...

More Telugu News