: మోడీ క్షమాపణలు చెబుతారా? లేక పరువునష్టం కేసు వేయాలా?: తృణమూల్ కాంగ్రెస్
మమతాబెనర్జీ పెయింటింగ్ అన్ని కోట్ల రూపాయలకు ఎలా అమ్ముడుపోయిందంటూ ప్రశ్నించిన నరేంద్రమోడీపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. నిన్న మోడీ పశ్చిమబెంగాల్లోని శ్రీరామ్ పూర్ లో పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ.. 'మీ (మమతాబెనర్జీ) పెయింట్స్ సాధారణంగా 4 లేదా 8 లేదా 15లక్షల రూపాయలే పలుకుతాయి. మరి మీదొక పెయింటింగ్ 1.81కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడానికి గల కారణం ఏంటి? అంత రేటు పెట్టి కొనుక్కున్న వ్యక్తి ఎవరు? ఎందుకు కొనుక్కున్నారో బెంగాల్ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు' అని అన్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముకుల్ రాయ్ స్పందిస్తూ ఈ ఆరోపణలను రుజువు చేయాలని, లేకుంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మోడీని డిమాండ్ చేశారు. లేకుంటే మోడీపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ పెయింటింగ్ విక్రయం ద్వారా వచ్చిన నిధులు సేవా కార్యక్రమాలకు, పార్టీ పత్రిక జాగోబంగ్లాకు వెళతాయని ఆయన చెప్పారు.