: ఆ ఈవీఎంలో ఓటేస్తే కాంగ్రెస్ కే!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లలో అక్రమాలు జరుగుతున్నాయని, ట్యాంపరింగ్ చేస్తే ఎవరికి ఓటేసినా తమకు కావాల్సిన వాళ్లకే పడేలా చేసుకోవచ్చన్న ఆరోపణలు తెలిసిందే. అయితే, ఈ విషయం ఇవాళ జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్షంగా రుజువైంది. మహారాష్ట్రలోని పూణెలో ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్న ఈవీఎంలో ఎవరికి ఓటేసినా కూడా కాంగ్రెస్ అభ్యర్థి ముందున్న లైటు మాత్రమే వెలుగుతోంది. అంటే అక్కడి ఓట్లన్నీ కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయిపోయాయన్నమాట.
పుణెలోని శ్యాంరావు కల్మాడీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జరిగిన ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది ఓటర్లు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో వాళ్లు వెంటనే పోలింగ్ ను నిలిపివేశారు. అయితే అప్పటికే చాలామంది అక్కడ ఓట్లు వేసేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు వెంటనే అక్కడకు కొత్త ఈవీఎం తెప్పించాలని ఆదేశించారని, అది త్వరలోనే రావచ్చని బీజేపీ కార్యకర్త ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, అప్పటికే ఓట్లు వేసిన 28 మంది ఓటర్లను మరోసారి కొత్త ఈవీఎంలో ఓట్లు వేయించడానికి అనుమతించాలని ఈసీ నిర్ణయించింది.