: సామాన్యులకు ఏదైనా చేయాలనే రాజకీయాల్లోకి వచ్చా: సుప్రియ
దేశం కోసం కళ్లు ఉన్నవారు ఏమీ చేయట్లేదని, సామాన్యుడికి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానని అంధురాలైన సుప్రియ వెల్లడించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొన్న మల్కాజిగిరిలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీకి దిగనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ సుప్రియ మీడియాతో మాట్లాడుతూ... సామాన్యుడి గళం అసెంబ్లీ, పార్లమెంటులో వినిపించాలని అన్నారు. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ప్రతిపక్షాలతో కలిసి బిల్లులను ఆమోదించి, సామాన్యుడికి అన్యాయం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు పోటీకి దిగానని సుప్రియ తెలిపారు. తనకు కళ్లు లేకపోయినా సామాన్యులకు ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చినట్టు ఆమె స్పష్టం చేశారు. సుప్రియ బీఏ ఎల్ఎల్ఎమ్ చదివి, 14 ఏళ్లుగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. రోల్ మోడల్ ఆఫ్ ఇండియాగా జాతీయ అవార్డు పొందారు. చట్టసభల్లో మహిళల సమస్యలపై పోరాడతానని ఆమె అన్నారు. న్యాయవాదిగా ఆమె ఒక్క కేసులో కూడా ఓడిపోలేదు. అలాగే ఈ ఎన్నికల్లో కూడా గెలుపొందుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.