: లాటరీ ద్వారా హెచ్-1బి వీసాలు
అగ్రరాజ్యం అమెరికాలో పనిచేసేందుకు అవసరమైన హెచ్-1బి వీసాలకు ప్రపంచ నలుమూలల నుంచి 1,72,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి సాధారణ కేటగిరీలో 65 వేలు, ప్రత్యేక కేటగిరీలో 20 వేల హెచ్-1బి వీసాలు మాత్రమే జారీ చేస్తారు. ఈ ఏడాది ఈ వీసాకు అప్లై చేసిన వారి సంఖ్య భారీగా ఉండటంతో... డ్రా విధానాన్ని ఆశ్రయించాలని సంబంధిత అమెరికా అధికారులు నిర్ణయించారు. ఈ విధానంలో, వచ్చిన దరఖాస్తులను కంప్యూటరైజ్డ్ పద్దతిలో డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. మన దేశం విషయానికొస్తే, ఐటీ నిపుణులు ఈ వీసాల కోసం తాపత్రయపడతారు. ఇప్పుడున్న విధంగా అమెరికా భవిష్యత్తులో కూడా అగ్రస్థానంలో నిలబడాలంటే, మరిన్ని హెచ్-1బి వీసాలను జారీ చేయాలని అమెరికన్ ఐటీ కంపెనీలు కోరుతున్నాయి.