: త్రీడీ టెక్నాలజీతో రోజుకి 30 సభల్లో ప్రసంగించనున్న చంద్రబాబు


సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలానికి వెళ్లనున్నారు. త్రీడీ పరిజ్ఞానంతో రాష్ట్రంలో సుమారు వెయ్యి సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్రీడీ టెక్నాలజీలో ప్రసంగించే వక్త ఒక చోటే ఉండి మాట్లాడతారు. కానీ అదే వక్త పలుచోట్ల ప్రసంగిస్తున్నట్లుగా కనిపిస్తారు. ఒకే సమయంలో ఎన్ని సభలు కావాలంటే అన్ని సభలు నిర్వహించుకోవచ్చు. అదే త్రీడీ టెక్నాలజీ ద్వారా చంద్రబాబు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. అదే రోజున త్రీడీ ద్వారా 20 ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి సభలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి సుమారు వెయ్యి వరకు నిర్వహించే ప్రణాళికతో బాబు ఉన్నారు.

అందుకు అవసరమైన స్టూడియోను చంద్రబాబు ఇప్పటికే తన నివాసంలో ఏర్పాటు చేసుకున్నారు. బాబు తన నివాసంలోని స్టూడియోలో ప్రసంగిస్తారు. త్రీడీ టెక్నాలజీ ద్వారా పెద్ద కంటెయినర్లను ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలనుకుంటున్నారో అక్కడ నిలిపి ఉంచుతారు. ఆ కంటెయినర్లే సభా వేదికలుగా ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి ఏర్పాట్లున్న 10 వాహనాలను టీడీపీ ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో సిద్ధం చేసుకుంది. ఒక వాహనం ద్వారా రోజుకి 2-3 సభలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పది వాహనాలుంటే రోజుకి 20 నుంచి 30 సభలు నిర్వహించే వీలుంది. మామూలు సభల మాదిరే జనాన్ని సమీకరించి అక్కడ త్రీడీ వాహనం పెడతారు. దీంతో చంద్రబాబు అక్కడే ఉండి మాట్లాడుతున్నట్లుగా ప్రసంగిస్తారు. ఓ పక్క ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటూనే ఈ త్రీడీ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని బాబు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News