: 17 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా: నరేంద్రమోడీ
తన వైవాహిక స్థితిపై గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నిజాలను బయటపెట్టారు. తాను 17ఏళ్ల వయసులోనే తన వయసుకు సమానమైన బాలికను వివాహం చేసుకున్నట్లు మోడీ వెల్లడించారు. వడోదర లోక్ సభ స్థానానికి నిన్న మోడీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో మోడీ తన వివాహానికి సంబంధించిన వివరాలను ప్రస్తావించారు. తన భార్యపేరు జశోదాబెన్ అని, ఆమె రిటైర్డ్ స్కూల్ టీచర్ గా ఉన్నారని పేర్కొన్నారు.
2001, 2002, 2007, 2012 గుజరాత్ ఎన్నికల సమయంలో మోడీ నామినేషన్ పత్రాల్లో వివాహం గురించి కాలమ్ ను ఖాళీగా వదిలి వేయగా... ఈసారి మాత్రం ప్రత్యర్థి కాంగ్రెస్ నేతల నోటికి తాళం వేసే ఉద్దేశంతో తన పెళ్లి గురించిన వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మోడీ పెళ్లి చేసుకుని భార్యతో ఎందుకు కలసి ఉండడం లేదంటూ లోగడ పలువురు కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, పెళ్లయిన రెండు వారాలకే మోడీ తన ఆశయాల కోసం భార్యతో విడిపోయినట్లు సమాచారం. ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రతీ అభ్యర్థి తన భార్య పేరిట ఉన్న ఆస్తులను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, తన భార్య జశోదాబెన్ కు ఉన్న ఆస్తుల వివరాలు తెలియవని మోడీ తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. మోడీ తన వైవాహిక స్థితిని నామినేషన్ పత్రాల్లో పేర్కొనకపోవడంపై సుప్రీంకోర్టులో 2012లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలవగా.. విచారణకు కోర్టు నిరాకరించింది.