: ప్రజల గురించి జయలలితకు పట్టదు: స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకువస్తారని డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి ఎంకె స్టాలిన్ ఆరోపించారు. డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడైన స్టాలిన్ సార్వత్రిక ఎన్నికల కోసం తమిళనాడు అంతటా ప్రచారం చేస్తున్నారు.
సెంట్రల్ చెన్నై నియోజకవర్గంలో మాజీ మంత్రి దయానిధి మారన్ తరపున స్టాలిన్ ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెన్నైలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం డీఎంకే మాత్రమే పాటుపడుతుందని చెప్పారు. పురుచ్చితలైవి పాలనలో సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యం అయ్యాయని, అరాచకం పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. జయ వాహనాల్లో ఎప్పుడూ రారని, ఆమె ఎలా వచ్చేది అందరికీ తెలుసునని, హెలికాప్టర్ లో తిరుగుతూ ప్రజలను చూస్తారని ఆయన విమర్శల వర్షం కురిపించారు. దేశం గురించి, ప్రజల గురించి ఆమెకు పట్టదని స్టాలిన్ దుయ్యబట్టారు.