: సార్వత్రిక ఎన్నికలు షురూ! ‘ఈశాన్యం’లో భారీగా పోలింగ్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఆరంభం అదిరింది. వెనుకబడ్డ ఈశాన్యంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. త్రిపుర (పశ్చిమ) లోక్ సభ స్థానంలో రికార్డు స్థాయిలో 85 శాతం పోలింగ్ నమోదైంది. తొమ్మిది దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ సోమవారం నాడు ప్రశాంతంగా ముగిసింది. అసోంలోని ఐదు, త్రిపురలోని ఒక లోక్ సభ స్థానానికి పోలింగ్ జరగ్గా, అసోంలోని 64.4 లక్షల ఓటర్లలో 78 శాతం, త్రిపురలోని 12.46 లక్షల ఓటర్లలో 85 శాతం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2009లో త్రిపుర, అసోంలలో పోలింగ్ కేంద్రాలకు యువ, మహిళా ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ‘‘అసోంలో మా అంచనాలకు మించి పోలింగ్ జరిగింది’’ అని ఢిల్లీలో డిప్యూటీ ఎన్నికల కమిషనర్ అలోక్ శుక్లా అన్నారు. అసోం సీఎం తరుణ్ గొగోయ్, ఆయన భార్య డాలీ, కొడుకు జొర్హాట్ లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "అసోంలో మోడీ మేజిక్ లేదని, తరుణ్ గొగోయ్ మేజిక్ మాత్రమే ఉంది" అని వ్యాఖ్యానించారు. త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ అగర్తలలో ఓటు వేశారు. అనంతరం సర్కార్ మీడియాతో మాట్లాడుతూ 'ఎక్కడా మోడీ మేజిక్ లేదని, అది కేవలం కార్పొరేట్ మీడియా సృష్టి' అని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ బుధవారం నాడు జరగనుంది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2), మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ లో ఓక్కో స్థానంలో మొత్తం 7 స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మిజోరాం పౌరసంస్థలు సోమవారం ఉదయం నుంచి 72 గంటల బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు సోమవారమే పోలింగ్ సిబ్బందిని తరలించారు. భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు.