: దక్షిణాఫ్రికాను వెంటాడిన దురదృష్టం... ఫైనల్లో టీంఇండియా
ప్రపంచకప్పుల్లో సెమీఫైనల్స్ గండం మరోసారి దక్షిణాఫ్రికాను వెంటాడింది. వర్షం అడ్డుకోలేదు, భారత స్పిన్నర్లు విజృంభించలేదు, భారీ స్కోరు కూడా చేసింది... అయినా, మరోసారి సెమీస్ లో చతికిలపడింది. టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో నిన్న జరిగిన రెండో సెమీస్ లో సఫారీలు 8 వికెట్ల నష్టానికి ఏకంగా 172 పరుగుల భారీ స్కోరు చేశారు. డుప్లెసిస్ (58), డుమిని (45), ఆమ్లా (22) పరుగులు చేశారు.
దీంతో, స్టెయిన్, మోర్కెల్, పార్నెల్ లాంటి బౌలర్లను ఎదుర్కొని భారత్ లక్ష్యాన్ని చేధిస్తుందా అన్న సంశయం అభిమానులందర్లోను నెలకొంది. అయితే, సఫారీల ఆశలను యువ సంచలనం విరాట్ కోహ్లీ నిలువునా కూల్చేశాడు. కోహ్లీ 72 (44 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీకి తోడుగా రహానే (32), రోహిత్ (24), రైనా (21, 10 బంతులు), యువరాజ్ (18) తలో చేయి వేశారు. దీంతో ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ఫార్మాట్ లో రెండో సారి విజయకేతం ఎగురవేయడానికి మరో అడుగు దూరంలో నిలించింది. ఏప్రిల్ 6న (ఆదివారం) భారత్, శ్రీలంకలు ఫైనల్స్ లో తలపడతాయి.