: టైటానియం వ్యవహారంపై నేడు గవర్నర్ కు నివేదిక
మన రాష్ట్రంలో జరిగిన టైటానియం కుంభకోణం అమెరికాలో వెలుగుచూసిన వైనం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు నిన్న సచివాలయంలో గనుల శాఖ, ఏపీఎండీసీ అధికారులతో రాష్ట్ర పరిశ్రమల ముఖ్యకార్యదర్శి సమీక్ష నిర్వహించారు.
గతంలో ఏపీఎండీసీకి, బోత్లీ సంస్థకు మధ్య జరిగిన సంప్రదింపులపై పూర్తి స్థాయిలో చర్చించారు. ఒప్పందాన్ని రద్దుచేయాలంటూ ఏపీఎండీసీ పంపిన దస్త్రంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే జాప్యం జరిగిందని సమీక్షలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సమీక్ష వివరాలన్నింటినీ క్రోడీకరించి ఓ నివేదికను రూపొందించారు. ఈ నివేదికను ఈ రోజు కాని, సోమవారం నాడు కాని గవర్నర్ కు అందజేయనున్నారు.