: టెన్త్ పరీక్షల టైం టేబుల్ మార్పుపై అప్రమత్తం చేయండి: డీఈవో
ఎన్నికల నేపథ్యంలో మారిన పదోతరగతి పరీక్షల తేదీలు, వేళలకు సంబంధించిన సమాచారాన్ని హైదరాబాదు జిల్లాలో పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థికి తప్పనిసరి చేరేలా చర్యలు చేపట్టాలని హైదరాబాదు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ జారీచేసిన కొత్త టైంటేబుల్ పై అన్ని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, విద్యాశాఖాధికారులకు గురువారం నాడు రవీంద్ర భారతిలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో డీఈవో సుబ్బారెడ్డి మాట్లాడుతూ... తాజా సమాచారం మేరకు ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. ఈ సమాచారాన్ని అన్ని పరీక్షా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్ల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు.