: సూర్యప్రభ వాహనంపై విహరించిన కోదండరాముడు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఇవాళ ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ అనంతరం కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం కన్నుల పండువగా సాగింది. పాలు, పెరుగు, తేనె, చందనంతో పాటు వివిధ రకాల ఫలరసాలతో సీతాలక్ష్మణ సమేత కోదండరాముని ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం చంద్రప్రభ వాహనంపై స్వామి ఊరేగనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద, చిన్న జీయర్ స్వాములు, స్థానిక ఆలయాల ఉపకార్య నిర్వహణాధికారి హరీంద్రనాథ్, ఏఈవో ప్రసాదమూర్తి రాజు, శేషారెడ్డి, మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.