: ఇంగ్లండ్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది!
ఇంగ్లండ్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది... దేంట్లో అని కదా మీ సందేహం. ఇప్పుడు అక్కడి వాతావరణంలో నిజంగానే దుమ్ము, ధూళి ఎక్కువైపోతోంది. లండన్, సౌత్ ఇంగ్లండ్, మిడ్ లాండ్స్, వేల్స్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ప్రమాదకర పరిస్థితులున్నాయని ప్రభుత్వమే చెబుతోంది. "అస్తమాతో బాధపడేవాళ్లు ఇంట్లోనే ఉండండి... ఎలర్జీలున్న వాళ్లూ గడప దాటి బయటకి రావద్దు. ఇక, సాధారణ ప్రజలు కూడా కళ్లద్దాలు లేకుండా బైక్ ఎక్కవద్దు" అంటూ తాజాగా ఇంగ్లండ్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఆఫ్రికాలోని సహారా ఎడారిలో మొదలైన ఈ ధూళి తుపాను ఆప్రికా దేశాలను ఊపిరాడకుండా చేస్తోంది. ఇప్పుడిక నిదానంగా యూరప్ దేశాలపై పడింది. ఇప్పటికే పారిస్, బ్రస్సెల్స్ వంటి ప్రాంతాల్లో ఆఫ్రికా దుమ్ము రేపుతోంది.
ఈ దుమ్ము ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఉన్న కాలుష్యంతో కలసి మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వాహనదారులకు ముందు ఏముందో కనపడని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు లండన్ నగరానికి కూడా ఆఫ్రికన్ దుమ్ము వచ్చేస్తే పరిస్థితి ఏమవుతుందోనని బ్రిటన్ కంగారుపడుతోంది. ఈ దుమ్ము ఉత్తర దిశగా దూసుకెళుతోంది.