: విమాన శకలాల అన్వేషణకు డెడ్ లైన్ లేదు: ఆస్ట్రేలియా ప్రధాని
దక్షిణ హిందూ మహాసముద్రంలో పడిపోయిందని భావిస్తున్న మలేసియా విమాన శకలాల అన్వేషణకు డెడ్ లైన్ అంటూ ఏమీ లేదని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ స్పష్టం చేశారు. పెర్త్ లో ఆయన మాట్లాడుతూ, ఎంహెచ్ 370 బ్లాక్ బాక్స్ ను గుర్తించగలిగే సాంకేతిక సామగ్రితో ఓషన్ షీల్డ్ అనే నౌక సముద్రంలో ట్రయల్స్ ప్రారంభించిందని తెలిపారు. దీనికి అత్యాధునిక సెన్సర్లున్న, నీటిలో ప్రయాణించే సామర్థ్యమున్న డ్రోన్ ఒకటి బిగించారు. ట్రయల్స్ విజయవంతమైన వెంటనే సముద్రంలో మలేసియా విమాన శకలాలు కన్పించిన దిశగా పడవ ప్రయాణం ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.
విమాన అన్వేషణ కార్యక్రమాలకు అధికారికంగా మలేసియా బాధ్యత వహిస్తున్నా, ఆస్ట్రేలియా ప్రభుత్వం నాయకత్వం వహిస్తోంది. గత మూడు వారాలుగా సముద్రంలో మలేసియా విమానం శకలాల ఆచూకీ కోసం ఏడు దేశాలకు చెందిన బృందాలు అన్వేషిస్తున్నాయి. శకలాలు కన్పిస్తున్న సంగతి అన్ని దేశాలు ధృవీకరిస్తున్నా అవి మలేసియా విమాన శకలాలుగా ఎవరూ నిర్థారించడం లేదు.
వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్న వస్తువుల దగ్గరికి ఓడలు తప్ప ఇంకేవీ వెళ్లలేవు. విమానాలు వెళ్తున్నా, తీరానికి దూరంగా ఉండడంతో ఎక్కువ సేపు అన్వేషణ సాగించే పరిస్థితి లేదు. ఇప్పటికి పది ఓడలు విమాన శకలాల అన్వేషణలో తలమునకలై ఉన్నాయి. ఈ రోజు మరో పది విమానాలు అన్వేషణకు దిగాయి.