: మెడికల్ పీజీ స్కామ్ కేసులో 19 మంది అరెస్టు
మెడికల్ పీజీ పరీక్ష స్కామ్ కేసులో సీఐడీ అధికారులు 19 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 40 నుంచి 50 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఎవరెవరికి, ఎంతెంత నగదు ముట్టింది? అన్న దానిపై సీఐడీ అధికారులు నిందితులను విచారిస్తున్నారు.
19 మందిలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. అందులో బెంగళూరుకు చెందిన రియల్టర్ సురేష్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. సురేష్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను సీఐడీ ఇప్పటికే గవర్నర్ నరసింహన్ కు అందజేసింది.
ఈ కుంభకోణంలో రాజకీయంగా గానీ, మరే విధంగా గానీ ఇంకెవరైనా ఉన్నారా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. స్కామ్ లో ఎవరి హస్తమున్నా, ఎంతటి వారైనా అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరో నాలుగు వారాల్లో మెడికల్ పీజీ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి పరీక్షను ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ఆలోచనలో ఉన్నారని సమాచారం అందింది.