: సినిమా సమీక్ష :'లెజెండ్'


ఇంట్లో కారం, ఒంట్లో అహంకారం లేకుండా బతకలేననే జితేందర్ (జగపతిబాబు) ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడమే లక్ష్యంగా పావులు కదుపుతాడు. అలాంటి జితేందర్ పెళ్లిచూపులకెళ్లి ఓ వివాదంలో చిక్కుకుంటాడు. ఆ ఊరి పెద్ద (సుమన్) జితేందర్ క్షమాపణ చెప్పి, నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇస్తాడు. ఆ ఊరి పెద్దమనిషి నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఆయన భార్య (సుహాసిని), కొడుకు కృష్ణ (బాలకృష్ణ)ను కిడ్నాప్ చేస్తాడు జితేందర్. కిడ్నాప్ వ్యవహారంలో తల్లి చనిపోవడంతో కృష్ణ జితేందర్ తండ్రి, అతని అనుచరులను చంపుతాడు. చిన్నవయస్సులోనే కృష్ణ ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి తలదూర్చడం ఇష్టం లేని తండ్రి కృష్ణను పై చదువుల కోసం లండన్ పంపుతాడు. చదువు పూర్తయ్యాక దుబాయ్ లో వ్యాపారవేత్తగా స్థిరపడిన కృష్ణ... పెళ్లి చేసుకొనేందుకు భారత్ కు తిరిగి వస్తాడు. ఈ క్రమంలో కృష్ణకు మళ్లీ జితేందర్ ఎదురయ్యాడా? కృష్ణ పెళ్లి సుఖాంతంగా జరిగిందా? జితేందర్ ముఖ్యమంత్రి అయ్యాడా, లేదా? అనే విషయాలు 'లెజండ్' సినిమాలో ఆసక్తికరంగా సాగుతాయి.

కృష్ణ పాత్రలో బాలకృష్ణ అదరగొట్టాడు. కథకు తగినట్టుగా... తన పాత్రను పండించడంలో బాలకృష్ణ సఫలమయ్యాడు. 'సింహా' తర్వాత ఓ పవర్ ఫుల్ పాత్రతో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక జితేందర్ పాత్రలో జగపతిబాబు తన పంథాను మార్చుకుని ప్రతికథానాయకుడి (విలన్) పాత్రలో అద్భుతంగా రాణించాడు. జితేందర్ పాత్ర లేకపోతే 'లెజెండ్' సినిమా లేదనే అభిప్రాయాన్ని కలిగించే రేంజ్ లో జగపతిబాబు ఈ విలన్ రోల్ చేశాడు. తన ఇమేజ్ కు భిన్నంగా కొత్త పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

కథలో భాగంగా హీరోయిన్స్ పాత్రలో రాధికా ఆంప్టే, సోనాల్ చౌహాన్ లకు పాటలకే పరిమితం కాకుండా నటనకు కూడా అవకాశమున్న పాత్రలు లభించాయి. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. రత్నం మాటలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రధానంగా ద్వితీయార్థంలో రత్నం మాటలు తూటాల్లా పేలాయి. తొలిసారిగా బాలకృష్ణ సినిమాకి సంగీతాన్ని సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ వినసొంపైన స్వరాలతో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమాలోని కీలక సన్నివేశాలను తన బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో రక్తి కట్టించాడు.

‘దమ్ము’తో ఎదురుదెబ్బ తిన్న బోయపాటి శ్రీను 'లెజెండ్' చిత్రంలో చక్కటి స్క్రీన్ ప్లే, పక్కా స్క్రిప్ట్ తో దూసుకుపోయాడు. తొలి భాగంలో కథ మామూలుగా నడిపించినా.. ద్వితీయార్థంలో సన్నివేశాలను పరుగులు పెట్టించి ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేశారు. ఈ సినిమా తొలి షోకే పాజిటివ్ టాక్ రావడంతో బాలకృష్ణకు మరో హిట్ సినిమాను దర్శకుడు బోయపాటి అందించారని చెప్పొచ్చు. అయితే మితిమీరిన హింస, ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లోని వయలెన్స్ ఈ సినిమాకి మైనస్ పాయింట్. అయితే బోయపాటి ఈ సినిమాని పక్కా కమర్షియల్ హంగులు, సెంటిమెంట్ తో పాటు బాలకృష్ణ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్ది బాలయ్య అభిమానులకు మరో మంచి సినిమాను అందించారు.

  • Loading...

More Telugu News