: మన పార్లమెంటు దీనికి నకలు
ప్రజాస్వామ్య భారత దేశాన్ని పరిపాలించే పార్లమెంటు భవనానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇలాంటి భవనం మరొకటి సాధారణంగా మనకు ఎక్కడా కనపడదు. చాలా భవనాలకు నకళ్లు ఉన్నా, మన పార్లమెంటు భవనానికి మాత్రం నకలు లేదు. అయితే మన పార్లమెంటు భవనమే ఒక భవనానికి నకలు అనే విషయం చాలా మందికి తెలియదు. మధ్యప్రదేశ్ లోని మోరేనా జిల్లాలోని మతౌలీ గ్రామంలోని చౌసట్టి యోగిని మందిరానికి నకలు రూపమే మన పార్లమెంటు భవనం.
మతౌలి గ్రామం గ్వాలియర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఢిల్లీకి పెద్ద దూరం కాదు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కోల్ కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని తలపోసిన బ్రిటిష్ పాలకులు ఆర్కిటెక్టులను సంప్రదించారు. ఆ క్రమంలో ఆర్కిటెక్టులు ఎడ్వర్డ్ బేకర్, లుట్యున్స్ పలు రకాల కట్టడాలను సందర్శించారు. అప్పుడు చౌసట్టి గుడిని చూశారు.
వృత్తలాకారంలో ఉన్న ఆ గుడి వారికి ఎంతగానో నచ్చింది. చౌసట్టి అంటే 64 మంది యోగినులు ఉండే దేవాలయం అని అర్థం. దీనిని ప్రతీహార రాజులు నిర్మించారు. ఇది ఎంత నచ్చిందంటే మన పార్లమెంటు భవనం ఇలాగే ఉండాలని వారు నిర్ణయించారు. 1912లో మన పార్లమెంటు భవనాన్ని అచ్చం అలాగే నిర్మించారు.