: చివరి ఓవర్లో హైడ్రామా!
బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది. ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లకు 168 పరుగులే చేసింది.
చివరి ఓవర్లో కివీస్ విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. అయితే, బౌలింగ్ కు దిగిన డేల్ స్టెయిన్ ఆ ఓవర్ తొలి బంతికే ల్యూక్ రాంచీని అవుట్ చేసి కివీస్ కు షాకిచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన నాథన్ మెకల్లమ్ రెండు, మూడు బంతులను వృథా చేశాడు. నాలుగో బంతికి ఫోర్ కొట్టి న్యూజిలాండ్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. కానీ, ఆ మరుసటి బంతికే అవుట్. ఇక, ఒక్క బంతికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి. స్ట్రయికింగ్ లో రాస్ టేలర్...! అప్పటికే 62 పరుగులు చేసిన ఆ స్టార్ బ్యాట్స్ మన్ ఆఖరి బంతికి రనౌటవడంతో కివీస్ ఓటమి ఖరారైంది.